: కలిసిపోయిన అంబానీలు...జియో, రిలయన్స్ కొత్త పుంతలు?
అంబానీ సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు వ్యాపార విస్తరణలో భాగంగా వ్యూహాత్మకంగా కలిసిపోయారు. జియోకు టవర్లు ఇవ్వమని ఎయిర్ టెల్, ఐడియా సెల్యూలార్ సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో అవాక్కైన ముఖేష్ అంబానీ చక్రం తిప్పి సోదరుడిని దారికి తెచ్చుకున్నాడు. దీంతో జియో ఆఫర్ ను తలదన్నే ఆఫర్ తో మార్కెట్ ను సొంతం చేసుకుందామని భావించిన ఇతర టెలికాం కంపెనీలకు సవాలు విసిరినట్టయింది. జియోతో రిలయన్స్ ను వర్చువల్ మెర్జ్ చేస్తున్నట్టు అంబానీ సోదరులు ముంబైలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. దీంతో రిలయన్స్ టవర్స్ ను జియో వాడుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్ కు భారీ మొత్తం చెల్లించనుంది. 2జి, 3జి, 4జి సర్వీసులకు అవసరమయ్యే స్పెక్ట్రమ్ తమ వద్ద ఉందని అనిల్ అంబానీ తెలిపారు. దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మరింత సమర్థవంతమైన సేవలు వినియోగదారులకు అందిస్తామని వారు పేర్కొన్నారు. కాగా, ఎయిర్ సెల్ ను విలీనం చేసుకోవడం ద్వారా 12 టెలికాం సర్కిల్స్ తో రిలయన్స్ ముందంజలో ఉందని ఆయన చెప్పారు. కంపెనీ పేరిట ఉన్న 75 శాతం అప్పును వచ్చే ఏడాదిలోగా తీర్చేయాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఆయన ప్రకటించారు. వీరిద్దరి కలయికతో జియో, రిలయన్స్ వ్యాపారం కొత్తపుంతలు తొక్కనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.