: నిజాన్ని అతను బయటపెడితే అంతా షాకవుతారు: రాకేష్ రోషన్
బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరూ పరస్పరారోపణలు సంధించుకోవడమే కాకుండా, పోలీసు స్టేషన్ మెట్లెక్కిన సంగతి కూడా తెలిసిందే. 'కైట్స్' సినిమా షూటింగ్ సందర్భంగా తమ మధ్య ప్రేమ చిగురించిందని కంగనా చెబుతుండగా, అలాంటిదేమీ లేదని, ఆమె ఊహల్లో ఉందని హృతిక్ సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఏం జరిగిందన్న సంగతి తెలిసిన వ్యక్తి ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ తాజాగా స్పందించారు. ఈ వివాదంపై ఆయన మాట్లాడుతూ, హృతిక్ ఎవరినీ బాధపెట్టే మనిషి కాదని అన్నారు. తన గురించి ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేసినా, విని ఊరుకుంటాడు తప్ప వాటిని పట్టించుకోడని చెప్పారు. అయితే, ఈ విషయంపై హృతిక్ గనక నిజాలు బయటకి చెబితే అంతా షాక్ అవుతారని ఆయన తెలిపారు. అయితే అది వెల్లడించాలా? వద్దా? అనేది పూర్తిగా అతని ఇష్టమని ఆయన చెప్పారు. ప్రస్తుతం హృతిక్ తాను నిర్మిస్తున్న 'కాబిల్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడని, దాని నుంచి విరామం దొరికిన తరువాత దాని గురించి స్పందించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.