: మనకి అన్యాయం, అవమానం జరిగాయి.. సమస్యలు తీర్చడానికే నన్ను ఎన్నుకున్నారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో పర్యటిస్తున్నారు. అక్కడి జిల్లెళ్లమూడి వద్ద నల్లమడ వాగును ఆయన పరిశీలించారు. వరదలతో నిండిన ప్రాంతాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా తాము ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు. నల్లమడ వాగు వెడల్పు పనులకి అక్కడి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ‘మనకి అన్యాయం జరిగింది.. అవమానం కూడా జరిగింది. ఒక్క చంద్రబాబు తప్పా వేరే ఎవ్వరూ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి పరిష్కారం చేయలేరని నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. అన్ని సమస్యలు తీర్చడానికి నేను పోరాడుతున్నా. విజభన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నా. 2018 లోపు పోలవరం పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. ప్రతి సోమవారం పోలవరంలో పర్యటిస్తున్నా. ప్రతి సోమవారం మాకు సోమవారం కాదు.. పోల'వారం'. దీక్షతో పనిచేస్తున్నాను.. నదుల అనుసంధానంతో కరవు లేకుండా చేస్తున్నాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.