: సీఎం కేసీఆర్ ఎదుటే యువకుడి ఆత్మహత్యాయత్నం
సీఎం కేసీఆర్ ఎదుట ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగింది. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యలు చెప్పుకునేందుకు మహదేవ్ పూర్ మండలంలోని ఎడవల్లి గ్రామానికి చెందిన గోపి అనే యువకుడు ఇక్కడికి వచ్చాడు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. కానీ, వరద పరిస్థితుల కారణంగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ కార్యక్రమం కూడా రద్దు చేశారు. అయితే, కలెక్టరేట్ లోని మూడో అంతస్తులో అధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన వస్తున్న సమయంలో గోపి తన వద్ద ఉన్న పురుగుల మందు తాగి సీఎం వద్దకు వచ్చాడు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గోపికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.