: రూపాయే కదా అని నొక్కేస్తే.. ఫలితం ఇలాగే ఉంటుంది!
రూపాయి.. ఇప్పుడు దీని విలువ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతున్నవారు దీనిని అంతగా పట్టించుకోవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఇక బస్సు ప్రయాణాల్లో రూపాయిని పట్టించుకునే వారే కరవు. చిల్లర లేదని చెప్పి రూపాయి ఎగ్గొట్టే కండక్టర్లు ఎందరో. ఈ విషయాన్ని పక్కనపెడితే అన్యాయంగా రూపాయి ఎగ్గొట్టినందుకు బెంగళూరులో ఓ హోటల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో వాసుదేవ్ అడిగ అనే వ్యక్తికి చెందిన ఫాస్ట్‌ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ హోటల్‌కు లాయర్ టి.నర్సింహమూర్తి వెళ్లి ప్లేట్ ఇడ్లీ తిన్నారు. నిజానికి ఇడ్లీ ఖరీదు రూ.24 కాగా హోటల్ యాజమాన్యం రూ.25 వసూలు చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన నర్సింహమూర్తి హోటల్ యాజమాన్యం తన నుంచి అన్యాయంగా, అక్రమంగా రూపాయి ఎక్కువ తీసుకుందంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఒక్కో వినియోగదారుడి నుంచి రూపాయి చొప్పున ఎక్కువ తీసుకుంటున్న హోటల్ రోజుకు ఎంత అక్రమంగా తీసుకుంటున్నదీ లెక్కలు వేసి మరీ చూపించారు. దీంతో వినియోగదారుల ఫోరం హోటల్‌కు నోటీసులు పంపింది. చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చేందుకే కస్టమర్ల నుంచి రూపాయి అదనంగా తీసుకుంటున్నట్టు హోటల్ యాజమాన్యం పేర్కొంది. ఈ వాదనతో కన్జ్యుమర్ ఫోరం ఏకీభవించలేదు. అదనంగా రూపాయి వసూలు చేసిందుకు నష్టపరిహారం కింద బాధితుడికి వెయ్యి రూపాయలు చెల్లించడంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హోటల్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆదేశిస్తూ కేసును డిస్మిస్ చేసింది.