: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్.. కివీస్‌ను మెలితిప్పేసిన అశ్విన్
చారిత్రక 500వ టెస్టును గెలుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. కాన్పూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ దాదాపు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. నాలుగో రోజు 434 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన కివీస్ ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. అద్భుతాలు జరిగితే తప్ప కివీస్ గెలుపు అసాధ్యం. స్టార్ ఆటగాడు విలియమ్సన్ సహా ప్రధాన ఆటగాళ్లను భారత బౌలర్లు పెవిలియన్ పంపడంతో టీమిండియా విజయం లాంఛనంగా మారింది. ఓపెనర్లు గప్తిల్(0), లాథమ్(2), విలియమ్సన్(25), రాస్ టేలర్(17) వికెట్లను స్పిన్నర్లు నేలకూల్చారు. మొత్తం నాలుగు వికెట్లలో మూడింటిని అశ్విన్ నేలకూల్చి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ప్రస్తుతం రోంచి(38), శాంటర్న్(8) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 159/1తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 377/5 వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్‌శర్మ(68), రవీంద్ర జడేజా(50) మెరుపులు మెరిపించి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలకపాత్ర పోషించారు. ఆరు వికెట్లు చేతిలో ఉన్న కివీస్, విజయం కోసం ఇంకా 341 పరుగులు చేయాల్సి ఉంది. కివీస్ ఓటమి దాదాపు ఖాయమైన వేళ చివరి రోజు బ్యాట్స్‌మెన్లు ఏమేరకు పోరాడతారన్నది వేచి చూడాల్సిందే.