: అంచనాలకు మించిన వృద్ధి ఖాయం: పనగారియా

దేశవ్యాప్తంగా సంతృప్తికర వర్షాలు, సంస్కరణలు అమలు జరుగుతున్న తీరు, సమయానుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా భారత స్థూల జాతీయోత్పత్తి రేటు 8 శాతాన్ని అధిగమించనుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తదుపరి త్రైమాసికాల్లోనే 8 శాతం జీడీపీని నమోదు చేస్తామన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు. చేపట్టిన సంస్కరణల ఫలాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అందలేదని, గతంలో ప్రాజెక్టులు చేపట్టినా అవి ఆగిపోయేవని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. కాగా, ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆరు త్రైమాసికాల కనిష్ఠస్థాయిలో 7.1 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. గనులు, నిర్మాణ రంగాలతో పాటు వ్యవసాయ రంగాల్లో ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణం. అయితే, ఈ సీజన్ లో రుతుపవనాల కారణంగా ఖరీఫ్ లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 9 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 135.03 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు పనగారియా తెలిపారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజనులో 124.01 మిలియన్ టన్నుల ధాన్యాల దిగుబడి నమోదైన సంగతి తెలిసిందే.

More Telugu News