: నాకొక్కడికే కాదు... దేశమంతటినీ కలచివేసి ఆగ్రహాన్ని తెప్పిస్తున్న పాక్ వైఖరి: మన్ కీ బాత్ లో నిప్పులు చెరిగిన ప్రధాని


పాకిస్థాన్ వైఖరి, ఉగ్రవాదుల పట్ల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు తనతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 'మన్ కీ బాత్'లో భాగంగా ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా మోదీ ప్రసంగించారు. యూరీలోని ఆర్మీ బేస్ పై దాడి చేసి 18 మందిని పొట్టన పెట్టుకున్న ఘటన భారతీయులను కలచి వేసిందని అన్నారు. వీర మరణం పొందిన వారికి వందనం చేస్తున్నానని, పదే పదే పాకిస్థాన్ చేస్తున్న తప్పులకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తామని చెప్పారు. పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన దివ్యాంగులు దేశంలోని క్రీడాకారుల్లో ఎంతో స్ఫూర్తిని నింపారని మోదీ కొనియాడారు. రియో పతకంతో దీప, జజారియాలు భారత కీర్తిని దశదిశలా వ్యాపించేలా చేశారని అన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ఆటగాళ్లు మరింతగా రాణించాల్సి వుందని, ఆ దిశగా తానేం చేయాలో తనకు తెలుసునని అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అయిందని, ఈ రెండేళ్ల కాలంలో పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందని మోదీ వివరించారు. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ శుభ్రమైన రహదారులు కనిపించడం మొదలైందని, ఇది తన ఒక్కడి కృషి కాదని, దేశ ప్రజలంతా తన ఆలోచనను పాటిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ ను ప్రజల్లోకి చేర్చేందుకు ప్రసార మాధ్యమాలు కూడా కష్టించాయని అన్నారు. వచ్చే సంవత్సరం వ్యవధిలో దేశవ్యాప్తంగా కోటిన్నర మరుగుదొడ్లు నిర్మించనున్నామని తెలిపారు. మరుగుదొడ్డి లేని పాఠశాల కనిపించకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాలు టాయ్ లెట్స్ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా చక్కగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News