: నేడు పల్నాడుకు చంద్రబాబు... రేపు జగన్!
భారీ వర్షాలతో అతలాకుతలమైన పల్నాడు ప్రాంతంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, రేపు, ఎల్లుండి విపక్ష నేత వైఎస్ జగన్ లు పర్యటించనున్నారు. గురజాల నియోజకవర్గంలో నీట మునిగిన పంటలను, దెబ్బతిన్న ఇళ్లను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆపై క్షేత్ర స్థాయిలో నష్టం వివరాలపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక సోమ, మంగళవారాల్లో జగన్ పల్నాడు ప్రాంతంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పొంగిన వాగులను, నీట మునిగిన గ్రామాలను ఆయన పరిశీలిస్తారని తెలిపారు. వర్షం కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన, నీట మునిగిన పంట వివరాలపై బాబు సర్కారు అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. మూడు లక్షలకు పైగా ఎకరాల్లో పంట సర్వనాశనం కాగా, పాడైన పంట 1.80 లక్షల ఎకరాలేనని ప్రభుత్వం బొంకుతోందని అన్నారు.