: భార్య శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన సంఘటన వెనుక వాస్తవాలు ఇవట!
గత నెలలో ఒరిస్సాకు చెందిన దనా మాఝీ అనే వ్యక్తి తన భార్య శవాన్ని భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్లిన వార్త ఎంతగానో కదిలించివేసింది. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ వార్తపై ప్రముఖంగా చర్చించారు. అయితే, ఈ సంఘటనపై 'వాస్తవాలు ఇవి' అంటూ ఒరిస్సా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒక నివేదికను ఆరోగ్య శాఖ మంత్రి అతాను సవ్యసాచి ఈరోజు అసెంబ్లీలో వెల్లడించారు. ఈ సంఘటనపై ప్రభుత్వ స్పందన కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రఫుల్ కుమార్ కు మంత్రి రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఆసుపత్రి నుంచి తన భార్యను ఇంటికి తీసుకువెళ్తున్నట్లు దనా మాఝీ అక్కడి సిబ్బందికి చెప్పలేదని పేర్కొన్నారు. ఆమె మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించకముందే, మాఝీ తన భార్యను తీసుకుని హడావుడిగా తీసుకువెళ్లడం వల్లే ఈ వ్యవహారం వార్తల్లోకెక్కిందన్నారు. ఈ సంఘటనపై ఆసుపత్రిలోని రోగులు, ప్రత్యక్షసాక్షుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు, కలహండి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఈ నివేదిక రూపొందించడం జరిగిందన్నారు. ఒకవేళ అతని వద్ద డబ్బులు లేనిపక్షంలో సీఎం సహాయ నిధి ద్వారానో లేక రెడ్ క్రాస్ ద్వారానో సాయమందించేవారమని ఆయన సమాధానమిచ్చారు. అయితే, మాఝీ తన భార్య శవాన్ని భుజాన వేసుకుని రోడ్డుపై వెళుతున్న సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్స్ పంపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.