: నాయకుల కంటే ప్రజలే తెలివైన వారు: విశాఖలో వెంకయ్య నాయుడు
నాయకుల కంటే ప్రజలే తెలివైన వారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రజలు అభివృద్ధికి తోడ్పడే నాయకులను ఎంపిక చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ అభివృద్ధిలో దూసుకువెళుతోందని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓ వైపు చైనా వంటి దేశాల ఎకానమీ ప్రతికూలంగా ఉంటే.. భారత్ పుంజుకుంటూ ముందుకువెళుతోందని చెప్పారు. దేశంలో పెట్టుబడులు పెట్టిన వారికి భరోసాగా ఉంటామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఇచ్చిన వరంగా వెంకయ్య నాయుడు అభివర్ణించారు. ఆ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అన్నారు. కేంద్రంలో మోదీ, ఏపీలో చంద్రబాబు సమర్థవంతమైన పాలననందిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో కలిసి పనిచేస్తే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని అన్నారు.