: నూతన కొనుగోళ్లు వెల్లువెత్తిన వేళ... రూ. 1.12 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
రెండు రోజుల పాటు ఒడిదుడుకుల్లో సాగిన బెంచ్ మార్క్ సూచికలు గురువారం నాడు కొనుగోలు మద్దతు వెల్లువెత్తడంతో దూసుకెళ్లాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 350 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్, తదుపరి కొంత లాభాల స్వీకరణను ఎదుర్కొంది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ కంపెనీలు ఈక్విటీలను కొనుగోలు చేశాయని స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. రూపాయి మారకపు విలువ 15 పైసల మేరకు మెరుగుపడటం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచింది. బుధవారం నాడు రూ. 1,11,21,151 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,12,33,357 కోట్లకు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 1.12 లక్షల కోట్ల మేరకు పెరిగింది. లార్జ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య తరహా కంపెనీలు మరిన్ని లాభాలను మూటగట్టుకున్నాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 265.71 పాయింట్లు పెరిగి 0.93 శాతం లాభంతో 28,773.13 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 90.30 పాయింట్లు పెరిగి 1.03 శాతం లాభంతో 8,867.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.39 శాతం, స్మాల్ కాప్ ఒక శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 38 కంపెనీలు లాభపడ్డాయి. అరవిందో ఫార్మా, హిందాల్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, లుపిన్, టీసీఎస్, కోల్ ఇండియా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,973 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,695 కంపెనీలు లాభాలను, 1,044 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మరో వారంలో పరపతి సమీక్ష జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ నుంచి వెలువడే నిర్ణయాలు, యూఎస్ ఫెడ్ తీసుకునే నిర్ణయం మార్కెట్ కు దశ, దిశను నిర్దేశించగలవని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు.