: మా దేశంలో వెబ్ సైట్ లు 28 మాత్రమే... నోరు జారి ఆశ్చర్యకర నిజం చెప్పిన ఉత్తర కొరియా

ఉత్తరకొరియా... దాదాపు ప్రపంచమంతా పక్కనబెట్టిన ప్రమాదకర దేశం. ఇక ఈ దేశపు కోడ్ తో ఉన్న డొమైన్ నేమ్ లు కేవలం 28 మాత్రమేనట. పొరపాటున నోరుజారిన ఉత్తరకొరియా ఈ విషయాన్ని స్వయంగా చెప్పి ఆశ్చర్యకర నిజాన్ని బయటపెట్టింది. 'డాట్ కేపీ'తో ముగిసే వెబ్ సైట్లు 28 ఉన్నాయని తెలిపింది. ఇది ఎంత చిన్న సంఖ్యంటే ఒక్క హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, 'డాట్ ఇన్'తో ముగిసే వెబ్ సైట్లు 2 నుంచి 3 వేల వరకూ ఉంటాయని అంచనా. డాట్ కాంల యుగం విస్తరించిన తరువాత డొమైన్ నేమ్ లను దేశాల కోడ్ ను సూచిస్తూ తయారు చేయడం మొదలైన సంగతి తెలిసిందే. జర్మనీ 'డాట్ డీఈ' పేరిట సొంత వెబ్ అడ్రస్ లను కలిగివుండగా 1.6 కోట్ల వెబ్ సైట్లు 'డీఈ'తో ముగిసేవి ఉన్నాయి. ఇక ఉత్తర కొరియాకు ఉన్న 28 వెబ్ సైట్లలో చాలా వరకూ న్యూస్ ఏజన్సీలవే కాగా, ఎయిర్ కొరియా అధికారిక వెబ్ సైట్ కూడా ఇందులో ఉంది. 'ఫ్రెండ్' పేరిట ఓ సోషల్ నెట్ వర్క్ సైట్ కూడా ఉంది. ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి తమ వెబ్ సైట్లకు ట్రాఫిక్ పెరుగుతుందన్న ఉద్దేశంతో వెబ్ సైట్లన్నింటినీ డౌన్ చేయాలని అధికారులు ఆదేశించారు.

More Telugu News