: బరితెగించి మాట్లాడిన పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బరితెగించి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. భారత సైనికులు హతమార్చిన ఉగ్రవాది బుర్హాన్ వనిని అమరవీరుడిగా కీర్తించిన ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పాక్‌పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఆ దేశం ఓ ఉగ్రవాద రాజ్యమని భారత్‌కు చెందిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు. పాక్ యుద్ధ నేరాలు చేస్తూ రెచ్చిపోతుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని అక్బర్ పేర్కొన్నారు. ఆ దేశంలో టెర్రరిస్టులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నారని తెలిపారు. ఆ దేశ ప్రధాని ఒక ఉగ్రవాదిని ప్రశంసిస్తూ మాట్లాడడమేంటని ప్రశ్నించారు. ఆ దేశం ఎంతో నీచంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి ప్రయత్నాలు ఆ దేశం ఎన్నడూ చేయలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆయుధాలను పట్టుకుని భారత్‌తో చర్చలు కావాలని ఆ దేశం కోరుకుంటోందని అన్నారు. భారతీయ అధికారి ఈనమ్ గంభీర్ కూడా పాక్ ప్రధాని చేసిన మాటలను ఖండిస్తూ... ఆ దేశానికి వస్తున్న నిధులను ఉగ్రవాదులకు అందిస్తోందని ఆరోపించారు. అందుకే ఉగ్రవాదులు పాక్ పొరుగు దేశాలపై దాడి చేస్తున్నాయని అన్నారు. ముంబయిలో పేలుళ్లు జరిపిన జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్విలాంటి ఉగ్రనేతలను ఆ దేశంలో స్వేచ్ఛగా తిరిగే వీలును పాక్ కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ దేశ సర్కారు సమక్షంలోనే ఉగ్రవాదులకు నిధులు మళ్లుతున్నాయని అన్నారు.