: మాటలు మాత్రమే కాదు... మా చేతలనూ చూస్తారు: మనోహర్ పారికర్
18 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న యూరీ ఆర్మీ బేస్ పై దాడి తరువాత, పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయ యువత ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న వేళ, మరోసారి ఈ తరహా దాడులను జరగనివ్వబోమని రక్షణమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. పాక్ ను నిలువరిస్తామంటూ కేవలం మాటలు చెప్పడమే కాదని, చేతల్లోనూ చూపిస్తామని ఆయన అన్నారు. "మన వైపు నుంచి ఏదో తప్పు జరిగింది. దాని గురించి మరింతగా మాట్లాడటం అనవసరం. ఇది చాలా సున్నితమైన అంశం. ఏదైనా తప్పు జరిగితే, అది మళ్లీ జరుగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాం. ఇలా మరోసారి జరగనివ్వకుండా జాతికి అభయమివ్వాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించే ప్రతిస్పందన ఇవ్వాలి. ఏదో పిచ్చిగా, నియంత్రణ లేని ప్రకటనలు ఇచ్చే వారిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు" అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం, ఇందుకు బాధ్యులు శిక్ష నుంచి తప్పించుకోరాదని స్పష్టంగా చెప్పారని, పాక్ వైఖరిని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపారు.