: దెబ్బతీసిన జపాన్... లాభాల నుంచి నష్టాల్లోకి సెన్సెక్స్
పరపతి సమీక్షలో భాగంగా రివర్స్ వడ్డీ రేటునే కొనసాగించాలని జపాన్ తీసుకున్న నిర్ణయం రూపాయి మారకపు విలువను దెబ్బతీయడంతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. సెషన్ ప్రారంభంలో భారీ లాభాల వైపు పరుగులు పెట్టిన సెన్సెక్స్, రూపాయి పతనం వార్తలతో అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 67.03గా నమోదైంది. దీంతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకే మొగ్గు చూపారు. భారీ కంపెనీల వాటాలను విక్రయించేందుకు క్యూ కట్టారు. దీంతో లార్జ్ క్యాప్ కంపెనీలు నష్టపోగా, స్మాల్ క్యాప్ కంపెనీల్లో చెప్పుకోతగ్గ కొనుగోలు కనిపించడం గమనార్హం. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 15.78 పాయింట్లు పడిపోయి 0.06 శాతం నష్టంతో 28,507.42 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 1.25 పాయింట్లు పెరిగి 0.01 శాతం లాభంతో 8,777.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.07 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.19 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 30 కంపెనీలు లాభపడ్డాయి.ఇన్ ఫ్రాటెల్, ఐచర్ మోటార్స్, హిందాల్కో, హిందుస్థాన్ యూనీలీవర్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ గ్రిడ్, అంబుజా సిమెంట్స్, ఎస్బీఐ, ఐటీసీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,923 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,413 కంపెనీలు లాభాలను, 1,312 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. 1,11,12,091 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,11,21,151 కోట్లకు పెరిగింది.