: భారత్ పై ఎప్పుడంటే అప్పుడు దాడి చేయగలం: ముషారఫ్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారత్ పై తన అక్కసు వెళ్లగక్కారు. కోర్టు కేసులకు భయపడి ఇంగ్లండ్ లో దాక్కున్న ముషారఫ్ లండన్ నుంచి విపరీతమైన దేశభక్తిని ప్రదర్శించారు. కాశ్మీర్ లో ఏ దాడి జరిగినా పాకిస్థాన్ ను నిందించడం భారత్ కు అలవాటైపోయిందని ఆయన ఆరోపించారు. యూరీ సెక్టార్ లో సైన్యంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తమకు బాగా తెలుసని ఇండియన్ ఆర్మీ తెలిపిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడంటే అప్పుడు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో తాము భారత్ పై దాడులు చేయగలమని హెచ్చరించారు. మీకు నచ్చిన చోటు ఎంచుకుని మీరు దాడి చేస్తే... మాకు నచ్చిన చోటు ఎంచుకుని మేము దాడి చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాడి జరిగిన గంటల్లోనే ఈ దాడి పాక్ ఉగ్రవాదులే జరిపారని అనేందుకు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించారు. ఆయుధాలు, దుస్తులు, ఇతర సామగ్రి పాకిస్థాన్ కు చెందినవన్న సాక్ష్యాలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించడంతో... ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ ఆయుధాలనైనా కొనుగోలు చేయవచ్చని, ఆయుధాలు పాకిస్థాన్ కి చెందినవే అయినా దాడులు చేసిన వారు పాకిస్థాన్ కు చెందినవారన్న సాక్ష్యాలు లేవుకదా? అని ఆయన ప్రశ్నించారు.