: కాశ్మీరులో చిన్నారులు ఇలానా?... యూరీకి వెళ్లి వస్తున్న మీడియాకు ఎదురైన భయానక అనుభవం!
యూరీలో జరిగిన ఉగ్రదాడిని కవర్ చేసేందుకు మూడు రోజుల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లిన మీడియా, తిరుగు ప్రయాణంలో భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. నిండా 14 ఏళ్లు కూడా లేని చిన్నారులు వారి వెన్నులో వణుకు పుట్టించిన ఘటనను ఎన్డీటీవీ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ అఫైర్స్ ఎడిటర్ సుధీ రాజన్ సేన్ వెల్లడించారు. ఏం జరిగిందన్నది ఆయన మాటల్లోనే... "18 మంది సెక్యూరిటీ సిబ్బంది అమరులైన యూరీ ప్రాంతం నుంచి వెనక్కు వస్తున్నాం. కాశ్మీర్ లో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన వేళ, జాతీయ రహదారిపై నియమించిన భద్రతా జవాన్లను కొద్దిగా తగ్గించారు. నేను కారు ముందు సీట్లో కూర్చున్నాను. ఓ 12 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కారుకు అడ్డంగా వచ్చాడు. దీంతో వాహనాన్ని ఆపాము. దాదాపు అతని వయసులోనే ఉన్న మరో డజను మంది పిల్లలు వచ్చి కారుపై రాళ్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. వీరే కాశ్మీర్ లో రాళ్లు విసిరే నిరసనకారులు. అందరూ మైనర్లే. మా డ్రైవర్ ఆషిక్. అతని వయసు 50 ఏళ్లకు పైగానే ఉంటుంది. కాశ్మీర్ లో వేర్పాటువాదులు బంద్ కు పిలుపునిస్తే, మేము దాన్ని పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నామన్నది పిల్లల ఆరోపణ" అని చెప్పుకొచ్చారు. "ఆషిక్ కారు దిగి వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. మా కెమెరా పర్సన్ షేక్ మోమిన్. అతను స్థానిక ముస్లిం కుర్రాడు. శ్రీనగర్ లోనే చదువుకుని ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్నాడు. కారు దిగి పిల్లలతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. అతని చేతికి ఓ బ్యాండ్ ఉంది. దాన్ని చూసిన ఓ పిల్లాడు 'చేతికి బ్యాండ్ ఎందుకు ఉంది? అది ఇస్లాంకు వ్యతిరేకం. నువ్వో హిందువు. ఇండియన్ మీడియా' అంటూ దుర్భాషలాడాడు. అక్కడికి కొద్ది దూరంలోనే కొందరు పెద్దలు కూర్చుని ఉన్నా, ఎవరూ కల్పించుకోలేదు. సమస్య తీవ్రం అవుతుందని గమనించిన డ్రైవర్ ఆషిక్, తన మనవడి వయసులోని ఓ బాలుడి పాదాలను తాకి నమస్కరించాడు. తమను క్షమించాలని మరోసారి బంద్ ఆదేశాలను ధిక్కరించనని వేడుకున్నాడు. దీంతో ఆ పిల్లలంతా నోటితో చెప్పలేని విధంగా తిట్టారు. ఆ తరువాత అల్లాపై ప్రమాణం చేసి మరోసారి ఇలా చేయబోమని చెప్పిన తరువాతనే మమ్మల్ని వెళ్లనిచ్చారు. బతుకుజీవుడా అనుకుని బయటపడ్డాం" అని తెలిపారు. తమది భారత్ కాదని, వేర్పాటు వాదులే తమ నేతలన్న స్పష్టమైన అభిప్రాయం వారిలో ఉన్నట్టు కనిపించిందని చెప్పారు. " జాతీయ రహదారిపై ఓ చిన్న షాపు తెరచి వుండగా, షాపతను 'బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం ఈ నిరసనలు వస్తున్నాయని అనుకోవద్దు. మరేదో జరుగుతోంది' అని అన్నాడు. మేమెంతో భయపడ్డాం. శ్రీనగర్ లో మేము బసచేసిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న మసీదు నుంచి 'ఆజాదీ' కోసం నినాదాలు వినిపించాయి" అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.