: ప్రధాని అధికారిక నివాసం చిరునామా మారనుందా?
7, రేస్ కోర్స్ రోడ్, న్యూఢిల్లీ... ఈ మాటలు వినగానే గుర్తొచ్చేది ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం. ఇండియాలోని అతి ముఖ్యమైన చిరునామాల్లో ఇదొకటి. ఇక బీజేపీ ప్రజా ప్రతినిధి మీనాక్షీ లేఖి ప్రభుత్వానికి రాసిన లేఖను, అందులో ప్రస్తావించిన అంశాన్ని ప్రభుత్వం ఆమోదిస్తే, ప్రధాని ఇంటి చిరునామా మారుతుంది. 'రేస్ కోర్స్ రోడ్' అన్న పదం భారత సంస్కృతికి దూరంగా ఉందని, ఈ రోడ్డుకు 'ఏకాత్మా మార్గ్' అని పేరు పెట్టాలని మీనాక్షి సూచించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ లో సభ్యురాలిగా ఉన్న ఆమె, ఈ మేరకు తదుపరి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన చేయనున్నారు. ఆపై పేరు మార్పు తీర్మానం కష్టమేమీ కాదని అంచనా. గత సంవత్సరం ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్ గా పేరు మార్చినప్పుడు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.