: చిరంజీవి అంటే నాకు పిచ్చి: నటుడు దీపక్ సరోజ్
పలు చిత్రాల్లో బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ సరోజ్ ‘లవ్ కె రన్’ చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమాల్లో నటించాలని తానెప్పుడూ అనుకోలేదన్నాడు. చిన్నప్పుడు తన అల్లరి భరించలేకపోయేవారని, అందుకని, డ్యాన్స్ నేర్చుకోవడానికి తనను పంపించే వారని చెప్పాడు. తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ ఇప్పించారని చెప్పాడు. ఒక టీవీ చానెల్ డాన్స్ ప్రోగ్రాంలో తాను స్టేట్ ఫస్ట్ వచ్చానని, ఆ తర్వాత హీరో జగపతి బాబు చిత్రం ‘పెదబాబు’లో ఆయన చిన్నప్పటి పాత్ర తాను పోషించానని చెప్పాడు. ఆ తర్వాత ‘ఆర్య’ చిత్రంలో నటించానని అన్నాడు. అనంతరం, వరుస ఆఫర్లు రావడంతో బాలనటుడిగా 42 చిత్రాల్లో నటించినట్లు చెప్పాడు. ‘సినిమా ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం అంటే చెప్పడం కష్టం. ప్రతిఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది. కానీ, వ్యక్తిగతంగా చిరంజీవి అంటే నాకు పిచ్చి. ఇప్పటి హీరోల్లో అందరూ నాకు ఇష్టమే’ అని దీపక్ సరోజ్ చెప్పుకొచ్చాడు.