: ఒక్క రైలూ రాక నిర్మానుష్యమైన బెజవాడ రైల్వే స్టేషన్!

విజయవాడ రైల్వే స్టేషన్ నిత్యమూ 200కు పైగా రైళ్ల రాకపోకలతో బిజీగా ఉంటుంది. ఏపీలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ గా, లక్ష మందికి పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తుండే విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు బోసిపోయింది. రైళ్ల సిగ్నలింగ్ వ్యవస్థను అత్యాధునికీకరిస్తున్న సందర్భంగా, ఈ ఉదయం నుంచి అన్ని రైళ్లనూ శివార్లలోని స్టేషన్లలోనే నిలిపివేయడం మొదలైంది. దాదాపు వారం రోజుల పాటు విజయవాడ స్టేషన్ కు ఒక్క రైలు కూడా రాదు. దీంతో కొద్దిమంది అధికారులు మినహా, ప్రయాణికులు లేక స్టేషన్ నిర్మానుష్యంగా కనిపిస్తోంది. విజయవాడ స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన రైళ్ల కోసం రెండు ట్రాక్ లు ఉన్నప్పటికీ, సిగ్నలింగ్ వ్యవస్థను ఆపివేయడంతో, ఏ రైలూ స్టేషన్ లో ఆగకుండానే సాగుతుంది. గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లను సీతానగరంలో, హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లను కొండపల్లి, విశాఖ నుంచి వచ్చే రైళ్లను గుణదల స్టేషన్లలో నిలిపి, అక్కడే ప్రయాణికులను దించి, ఔటర్ లైన్ మీదుగా నగరాన్ని దాటిస్తున్నారు. దీంతో ఈ రైల్వే స్టేషన్లలో సందడి నెలకొంది. ఇక్కడ దిగితే, నగరంలోకి వెళ్లేందుకు సరైన సదుపాయాలు లేవని, ఆటో డ్రైవర్లు అధిక మొత్తాలను డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

More Telugu News