: ఆ విషయంలో టీమిండియాను మించిన జట్టు లేదు: కపిల్ దేవ్


ఒక విషయంలో టీమిండియాను మించిన జట్టు లేదని దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అభినందించారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దిగ్గజ స్టార్ క్రికెటర్లు ఒకరి వెంట ఒకరు జట్టును వీడినా టీమిండియా నిలదొక్కుకున్న తీరు అద్భుతమని అన్నారు. సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌ లాంటి ఆటగాళ్లు ఒకరి తరువాత ఒకరు రిటైర్మెంట్‌ ప్రకటించినా భారత జట్టు గాడిన పడిందని అన్నారు. ప్రపంచంలో ఏ జట్టూ ఇలా నిలదొక్కుకోలేదని చెప్పారు. ఇలా సీనియర్లు రిటైర్ అయితే ఈ జట్టు కోలుకునేందుకు సుమారు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుందని ఆయన పేర్కొన్నారు. టీమిండియా మాత్రం అద్భుతంగా నిలదొక్కుకుందని ఆయన ప్రశంసించారు. ధోనీ నుంచి కోహ్లీ టెస్టు క్రికెట్ బాధ్యతలు తీసుకున్న తరువాత జట్టు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆడుతున్న తీరు అద్భుతమని ఆయన తెలిపారు. ధోనీతో పోలిస్తే కోహ్లీ చాలా భిన్నమని ఆయన అన్నారు. కెప్టెన్ గా ప్రతి మ్యాచ్‌ గెలవాలన్న కాంక్ష జట్టును విజయానికి దగ్గర చేస్తుందని, కెప్టెన్ గా కోహ్లీ రాణించడం ఎంతో అవసరమని, అలాంటి అవసరాన్ని గుర్తించి అతను ఆడడం జట్టును మరింత పటిష్ఠం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కోచ్‌ గా కీలక బాధ్యతలు చేపట్టిన కుంబ్లేకు కొంత సమయమివ్వాలని ఆయన సూచించారు. కుంబ్లే అంకితభావం గురించి అందరికీ తెలిసిందేనని, జట్టులో స్ఫూర్తిని రగిలించడంలో కుంబ్లే సరైన వ్యక్తి అని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News