: హైదరాబాద్ లో వర్షం లేకున్నా.. నిలిచిపోయిన ట్రాఫిక్
మూడు రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు నగరంలో రోడ్లన్నీ జలమయం అవడమే గాక, ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. దీంతో, నత్తనడకలా వాహనాలు కదిలాయి. ఈరోజు వర్షం కురవనప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో అదే పరిస్థితి నెలకొంది. ఖైరతాబాద్- పంజాగుట్ట ప్రధాన రహదారి, సికింద్రాబాద్-బేగంపేట్ (గ్రీన్ ల్యాండ్స్ వైపు) మార్గంలోనూ వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూడు రోజుల క్రిత్రం వర్షాలకు రోడ్లు గుంతలు పడి, కంకర పైకి రావడంతో వాహనదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీనికితోడు, పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ వద్ద మెట్రో పనులు జరుగుతున్నాయి. దీంతో, ఇది ట్రాఫిక్ జామ్ కు దారి తీసింది. ఈ రోజు సోమవారం కావడంతో కార్యాలయాలకు వెళ్లే వారు, వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చే వారి కారణంగా ట్రాఫిక్ మరింత పెరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మ్యాన్ హోల్స్, రహదారులు దెబ్బతినడం, మెట్రోపనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని అన్నారు.