: తీవ్ర ఆగ్రహంతో భారత సైన్యం, సరిహద్దు దాటేందుకు అనుమతించాలని డిమాండ్
నిన్నటి యూరీ ఉగ్రదాడిని తీవ్రంగా తీసుకున్న సైన్యం, పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెప్పేలా సరిహద్దులు దాటి ప్రతిదాడులు జరిపేందుకు అనుమతించాలని కోరుతోంది. ఈ దిశగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఓ వర్గం సైనికుల నుంచి ఒత్తిడి వస్తోంది. 'పరిమితమైన సీమాంతర దాడి'కి తమకు అనుమతించాలని కొందరు డిమాండ్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా 778 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యమూ ఎక్కడో ఒకచోట పాక్ కాల్పులకు దిగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక సీమాంతర దాడికి ప్రభుత్వం అనుమతిస్తే, అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయని భావిస్తున్న కేంద్రం ఇప్పటికిప్పుడు అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. పఠాన్ కోట్, యూరీ ఆర్మీ పోస్టులపై ఉగ్రదాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ కు బుద్ధి చెప్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నేడు కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.