: అవును, ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని చెప్పింది నేనే!: వెంకయ్య నాయుడు
రాష్ట్ర విభజన సమయంలో గందరగోళ పరిస్థితుల్లోనూ తాను రాజ్యసభలో ఆనాడు 50 నిమిషాలు మాట్లాడినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈరోజు విజయవాడలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లని చెప్పింది తానేనని ఆయన వ్యాఖ్యానించారు. హోదా అంశాన్ని కాంగ్రెస్ విభజన చట్టంలో చేర్చలేదని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆరోజు చర్చ సజావుగా జరిగి ఉంటే ఏపీకి ఇప్పుడు ఇలాంటి తిప్పలు ఉండేవి కాదని ఆయన అన్నారు. విభజన జరగబోతోందని, ఏపీకి ఏం కావాలో అడగాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆనాడే తాను సూచించినట్లు వెంకయ్య తెలిపారు. కానీ తన మాటలను కాంగ్రెస్ నేతలు వినలేదని పేర్కొన్నారు. ఆనాడు జైరాం రమేశ్‌తో కలిసి తాను ఏడు రోజులు చర్చించినట్లు తెలిపారు. విభజన చట్టంలో ఏం చేర్చాలో చెప్పినట్లు తెలిపారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సాయంతో రాష్ట్రానికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడని అన్నారు. ఆ ప్రాజెక్టుపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేశామని చెప్పారు. పోలవరానికి ఏ ఇబ్బందులు రాకూడదని ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపినట్లు చెప్పారు.