: నమ్మిన పెమాఖండూ హ్యాండిచ్చిన వేళ... అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ వ్యూహానికి బేర్ మన్న కాంగ్రెస్!
దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్టు తయారైంది అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారాన్ని అప్పగించినా, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం అధిష్ఠానాన్ని మోసం చేసే మార్గాలనే ఎంచుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో పెమాఖండూను ముఖ్యమంత్రిని చేయగా, ఆయన ఏకంగా 42 మంది సభ్యులతో కలసి, బీజేపీ కూటమిలోని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లో చేరిపోయి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారు. 60 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలుండగా, వారిలో ఇద్దరు మినహా మిగతా అంతా ఫిరాయించేశారు. మాజీ ముఖ్యమంత్రి నబామ్ తుకీ కాంగ్రెస్ లో ఏకాకిగా మిగిలిపోయారు.
"నేను అసెంబ్లీ కార్యదర్శిని కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లో విలీనం చేస్తున్నట్టు చెప్పాను" అని పెమా ఖండూ మీడియాకు తెలిపారు. గత జూలైలో సుప్రీంకోర్టు తీర్పు తరువాత, ఎమ్మెల్యేలందరితో చర్చలు జరిపి మధ్యేమార్గంగా నబామ్ తుకీ స్థానంలో ఖండూను సీఎంగా నియమించిన సంగతి తెలిసిందే. అంతకుముందు కాంగ్రెస్ రెబల్స్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని పడగొట్టగా, సుప్రీంకోర్టు కల్పించుకున్న తరువాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఆపై ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాగైనా పట్టును పెంచుకోవాలని భావించిన బీజేపీ తనదైన శైలిలో పావులు కదిపి తాజా ఫిరాయింపుకు వెనకుండి ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎత్తుకు కాంగ్రెస్ చిత్తు కాగా, ఇప్పుడు తిరిగి అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు లేనట్టేనని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.