: ములాయం సీఎం కావాల్సిందే... శివపాల్ కొత్త వ్యూహంతో ఇరుకున పడ్డ అఖిలేష్!


యూపీలో రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీకి నష్టం కలిగిస్తున్న తాజా పరిణామాలను చక్కబెట్టేందుకు ఢిల్లీలో ఉన్న ములాయం లక్నోకు బయలుదేరిన వేళ, శివపాల్ కొత్త పాట అందుకున్నారు. యూపీకి ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ తిరిగి రావాలని వ్యాఖ్యానించి, అఖిలేష్ పై తన వ్యతిరేకతను తెలియజేయడంతో పాటు, రగిలిన రాజకీయ అగ్నికి ఆజ్యం పోశారు. "ఇప్పుడు ములాయం పార్టీ కార్యాలయానికి వస్తారు. అందరం అక్కడికి వెళదాం. మన మనసులోని మాటను నేతాజీకి చెబుదాం. ఆయన వెంటే ఉన్నామని నినదిద్దాం. పార్టీని బలహీనపరిచే ఉద్దేశం మనకొద్దు. ఆయన నాయకత్వమే మనకు కావాలి. మన బలం చూపిద్దాం" అంటూ, తన ఇంటి ముందు చేరిన కార్యకర్తలను ఉద్దేశించి శివపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. లక్నోలోని 7 కాళిదాస్ మార్గ్ లో అఖిలేష్ యాదవ్ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న శివపాల్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ కార్యాలయానికి బయలుదేరే ముందు తన ఇంటి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన టీషర్టులను తెచ్చి కార్యకర్తలకు ఇచ్చారు. వీటిపై సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు, శివపాల్, ములాయం ఫోటోలు ఉన్నాయి. ఇక రాజకీయాల్లో తలపండిన శివపాల్ యాదవ్ వ్యూహం ముఖ్యమంత్రి అఖిలేష్ ను ఇరుకున పడవేస్తుందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. ములాయం ముఖ్యమంత్రి కావాల్సిందేనని శివపాల్ గట్టిగా పట్టుబడితే, దాన్ని అఖిలేష్ సైతం కాదనలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తన బాబాయ్ వేస్తున్న ఎత్తులకు పైఎత్తు వేసేలా అఖిలేష్ ఎలాంటి వ్యూహంతో వస్తారో వేచిచూడాలి.

  • Loading...

More Telugu News