: ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలపై రిలయన్స్ జియో సంచలన ఆరోపణ
టెలికం కంపెనీలపై రిలయన్స్ జియో సంచలన ఆరోపణలు చేసింది. యూజర్ల నెంబర్ పోర్టబిలిటీని ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర సంస్థలు అడ్డుకుంటున్నాయంటూ ఆరోపించింది. వినియోగదారులు కొత్త నెట్‌వర్క్‌కు మారేందుకు ఈ సంస్థలు అంగీకరించడం లేదని పేర్కొంది. యూజర్ల రిక్వెస్టులను ఆయా సంస్థలు నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. ఈనెల 9 నుంచి 12వ తేదీ మధ్య కాలంలో నెంబర్ పోర్టబిలిటీ కోసం వినియోగదారులు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించాయని వివరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులు చేసుకున్న 4,919 రిక్వెస్టులు వీటికి అదనమని పేర్కొంది. ఆయా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ చర్యలు తీసుకోవాల్సిందిగా ‘ట్రాయ్’కు లేఖ రాసింది. ఇటువంటి సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలని రిలయన్స్ కోరింది. రిలయన్స్ ఆరోపణలపై ఆయా సంస్థలు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.