: మాటకు కట్టుబడే వ్యక్తి దేవినేని నెహ్రూ!: సీఎం చంద్రబాబు ప్రశంస


ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన మొదటి వ్యక్తి దేవినేని నెహ్రూ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేవినేని నెహ్రూ, అవినాష్, బుచ్చిబాబులను టీడీపీలోకి ఆహ్వానం పలికే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, మాటకు కట్టుబడే వ్యక్తి దేవినేని నెహ్రూ అని అన్నారు. నెహ్రూతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో పని చేస్తున్నానంటూ చెప్పారు. కరవుకు భయపడవద్దని ఈ సందర్భంగా రాయలసీమ వాసులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మేటైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, విజయవాడలోని మూడు కాలువలను సుందరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్ష సభ్యులు వారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మూడు రోజుల పాటు బెంచీలు ఎక్కారని, అనుభవంలేని వ్యక్తులు తప్పుడు మార్గంలో వెళుతున్నారని అన్నారు. సరైన నాయకుడు లేకపోతే మిగిలిన వారు ఉన్మాదుల్లా తయారవుతారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన కుటుంబమని, ఏపీ ప్రజలే తన కుటుంబసభ్యులని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News