: ధోనీ, గంగూలీల్లో ఎవరు బెస్ట్? అన్న ప్రశ్నకు యువరాజ్ సమాధానం ఇది!
యువరాజ్ సింగ్... అటు గంగూలీ కెప్టెన్సీలో ఎదిగి, ఇటు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రాటుదేలి ఎన్నో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్. ఇక ధోనీ, గంగూలీల్లో ఎవరు అత్యుత్తమ కెప్టెన్? అన్న ప్రశ్న తనకు ఎదురైన వేళ, ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చాడు. రేడియో మిర్చి నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న యువీని ఈ ప్రశ్న అడుగగా, "సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో నా కెరీర్ ప్రారంభమైంది. అతను జట్టును ఏకతాటిపై నిలిపేవాడు. నేను ఒక్కడినే కాదు. సెహ్వాగ్, నెహ్రా, జహీర్, హర్భజన్ వంటి ఎందరినో ప్రోత్సహించాడు కాబట్టి అతనే బెస్ట్" అని సమాధానం ఇచ్చాడు. ధోనీతో తనకు ఎలాంటి గొడవలూ లేవని, అతను తనకు మిత్రుడేనని కూడా చెప్పుకొచ్చాడు. కాగా, 2011 వరల్డ్ కప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ, తన కుమారుడికి, తదుపరి అవకాశాలు రానీయకుండా చేసింది ధోనీయేనని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.