: మోదీ విదేశాల్లో పర్యటించి దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు: ముఖ్యమంత్రి చంద్రబాబు
పట్టణాభివృద్ధిలో సాంకేతికతను వినియోగించుకోవడం ముఖ్యమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో బ్రిక్స్ పట్టణాభివృద్ధి మంత్రుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సదస్సులో ఉపన్యాసం చేస్తూ... సాంకేతికతను అందిపుచ్చుకొని అవినీతిరహిత పరిపాలన అందించాలని సూచించారు. పట్టణీకరణలో ప్రధానంగా కాలుష్యం, మురికివాడల సమస్య ఎదురవుతోందని వాటి నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కాలుష్యాన్ని మన ముందున్న సవాలుగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించి దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని చంద్రబాబు అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళుతోందని అన్నారు. 2050 నాటికి పట్టణాల్లోనే జనాభా అత్యధికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2022 నాటికి ఇండియాలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో టాప్ 3లో ఒకటిగా ఏపీ ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. తాము విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకొని ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో పట్టణాల ప్రణాళికలు సరిగ్గా లేకపోవడంతోనే అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డారు.