: తల్లి కావాలంటే తానిచ్చే మందే శరణ్యమన్నాడు... తాట తీయించుకున్నాడు!
సంతానం కోసం ఎదురు చూసే జంటలకు అల్లోపతిలో వైద్యులు ఇచ్చే మందులను మించిన మందులు తన దగ్గర ఉన్నాయని, తానిచ్చే మందులు వేసుకుంటే పిల్లలు పుట్టడం ఖాయమని ప్రచారం చేసుకుంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఆయుధం సీతయ్య ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతంలో తిరుగుతున్నాడు. రెండేళ్ల క్రితం 21 పిట్ ఏరియాలో ఓ జంటకు ఇలాంటి కట్టుకథలే చెప్పి 3,000 రూపాయలు తీసుకుని రెండు గ్లూకాన్-డీ ప్యాకెట్లలో బూడిద కలిపి ఇచ్చాడు. ప్రతిరోజూ పరగడుపున దీనిని తీసుకోవాలని వారికి చెప్పాడు. కొన్ని రోజులకు మళ్లీ ఇతర మందులు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. తరువాత ఎప్పుడు ఫోన్ చేసినా రేపు, మాపు అంటూ తప్పించుకోవడం మొదలుపెట్టాడు. దీంతో వారు విసిగిపోయి ఊరుకున్నారు. రెండేళ్ల తరువాత తను మళ్లీ అదే వీధిలో అవే కథలు చెబుతూ కనిపించాడు. దీంతో మోసపోయిన ఆ జంట సీతయ్యను పట్టుకుని నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న 24 ఫీట్ ఏరియాకు చెందిన మరి కొందరు వ్యక్తులు తమ వద్ద కూడా డబ్బులు తీసుకుని ఇలాగే మోసం చేశాడని ఆరోపిస్తూ దేహశుద్ధి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలికి చేరుకుని, అతనిని ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.