: రిలయన్స్ జియో ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను తీర్చనున్న బీఎస్ఎన్ఎల్!
శరవేగంగా ఎదుగుతున్న రిలయన్స్ జియో పలు బాలారిష్టాలను ఎదుర్కొంటున్న వేళ, సమస్యను తీర్చేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. జియో సిమ్ కార్డుల లభ్యత కష్టతరంగా ఉండటం, 4జీ సిగ్నల్స్ అన్ని ప్రాంతాల్లో ఇచ్చేందుకు మౌలిక వసతుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వేళ, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ మధ్య 'ఇంట్రా సర్కిల్ రోమింగ్' ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒకే టెలికం సర్కిల్ లో ఉన్న జీయో, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఏ కంపెనీ టవర్ కు సమీపంలో ఉన్నా సేవలందుకోవచ్చు. 4జీ సామర్థ్యమున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు రోమింగ్ మోడ్ లో జియో 4జీ సేవలను అందుకోవచ్చు. ఇదే సమయంలో జియో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ 2జీ తరంగాల ఆధారంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే, రిలయన్స్ 4జీ సేవలను పొందే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఏ మేరకు చార్జీలు చెల్లించాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ వెలువడలేదు. ఇదే సమయంలో తాము ఎలాంటి రోమింగ్ చార్జీలను విధించబోమని ఇప్పటికే ముఖేష్ అంబానీ స్పష్టం చేయడంతో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ సేవలు పొందితే, కేవలం కాల్ చార్జీలు మాత్రమే చెల్లిస్తే చాలని తెలుస్తోంది. కాగా, జియోతో డీల్ పూర్తిగా కుదరలేదని, అతి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని బీఎస్ఎల్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మేలు కలిగేలా తమ నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు. సంస్థ నెట్ వర్క్ కెపాసిటీని, నాణ్యతను పెంచుకుంటున్నామని, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లలో 4జీ సామర్థ్యమున్న ఫోన్లు వాడేవారు రిలయన్స్ 4జీ సేవలను పొందే రోజు త్వరలో వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తాము ఇదే తరహా ఒప్పందాన్ని వోడాఫోన్ తో కుదుర్చుకున్నట్టు గుర్తు చేశారు.