: సెరెనా, వీనస్ లు డోపీలే... 'వాడా' వెబ్ సైట్ ను హ్యాక్ చేసి బయటపెట్టిన రష్యా హ్యాకర్లు


సమకాలీన టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని మహిళా క్రీడాకారిణులుగా ఉన్న సోదరీమణుల ద్వయం సెరెనా విలియన్స్, వీనస్ విలియమ్స్ నిషేధిత ఉత్ప్రేరకాలను వాడారని రష్యాకు చెందిన 'ఫ్యాన్సీ బీరర్స్' హ్యాకర్లు డాక్యుమెంట్ల సాక్ష్యంతో బయటపెట్టారు. ఒలింపిక్స్ లో నాలుగు బంగారు పతకాలు సాధించిన సిమోన్ బైల్స్ కూడా డ్రగ్స్ వాడినట్టు హ్యాకర్లు పేర్కొన్నారు. వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ అసోసియేషన్) వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన రష్యన్లు, అందులోని డేటాబేస్ వివరాలు పరిశీలించి, ఎంతో మంది అమెరికన్లు నిషేధం అమలవుతున్న ఉత్ప్రేరకాలు వాడుతున్నారని, అయినా, వారందరినీ ఆటలకు అనుమతిస్తున్నారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై స్పందించిన వాడా, తమ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందని, క్రీడాకారులు గాయపడినప్పుడు వినియోగించే మందుల్లో కొన్ని నిషేధితాలు ఉంటాయని, నిబంధనల దృష్ట్యా, అనివార్యమైన వేళ, వీటిని డాక్టర్లు సూచన మేరకు తీసుకోవచ్చని తెలిపింది. ఆ వెంటనే ఫ్యాన్సీ బీరర్స్ మరిన్ని విషయాలు బయటపెడుతూ, అవసరం లేకున్నా దొంగ సర్టిఫికెట్లను అమెరికన్ ఆటగాళ్లు సృష్టించారని తెలిపింది. ఆక్సీకొడోన్, హైడ్రోమార్ఫోన్, ప్రిడ్నిసోన్ తదితరాలను సెరెనా, వీనస్ లు 2010 నుంచి 2015 మధ్య తీసుకుందని, 2010 నుంచి 2013 మధ్య వీనస్ పలు రకాల డ్రగ్స్ వాడిందని తెలిపింది. ఈ ఉదంతంపై ఐఓసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) స్పందిస్తూ, హ్యాకర్లు బయటపెట్టిన ఆటగాళ్ల పేర్లలో డోపీలు ఎవరూ లేరని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News