: కొడుక్కి షాక్ ఇచ్చిన తండ్రి... అఖిలేష్ యాదవ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన ములాయం!

వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కు దగ్గరి వారైన ఇద్దరు మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం అఖిలేష్ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ములాయం యూపీ సమాజ్ వాదీ అధ్యక్ష పదవి నుంచి సొంత కొడుకును తప్పించారు. ఆ స్థానంలో సోదరుడు శివపాల్ యాదవ్ ను నియమిస్తున్నట్టు ప్రకటించి, పార్టీకి అసలు బాస్ ను తానేనని మరోసారి నిరూపించుకున్నారు. నిన్న అఖిలేష్ తప్పించిన మంత్రులు గాయత్రి ప్రజాపతి, రాజ్ కిశోర్ సింగ్ లు ములాయంకు సన్నిహితులుగా ముద్రపడ్డ నేతలు కాగా, అవినీతికి పాల్పడితే, ఎంతటి వారైనా సహించేది లేదన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఆయనపైనే వేటు పడటం యూపీలో రాజకీయ వేడిని పెంచింది. రెండు నెలల క్రితం ములాయం ఒత్తిడి కారణంగానే దీపక్ సింఘాల్ ను సీఎస్ గా నియమించగా, ఆయన్ను కూడా అఖిలేష్ తొలగించారు. ఇదే సమయంలో గత నాలుగేళ్లుగా తన వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని అలిగున్న సోదరుడు శివపాల్ యాదవ్ ను బుజ్జగించడం కూడా ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

More Telugu News