: ఢిల్లీలో వ్యాధుల గురించి న‌న్ను అడ‌గ‌కండి.. మోదీనే అడ‌గండి: కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్


దేశ రాజధాని ఢిల్లీలో చికెన్‌ గున్యా, డెంగీ, మలేరియా వ్యాధులు వ‌ణికిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న ఢిల్లీలో విజృంభిస్తోన్న వ్యాధుల ప‌ట్ల ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ వాటిపై కూడా ప్ర‌ధాని మోదీనే నిందించారు. ఆ వ్యాధుల అంశాన్ని గురించి ప్రధానిని అడగండి అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఓ ప‌క్క ఈ వ్యాధులు విజృంభిస్తోంటే, మ‌రో ప‌క్క ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ గోవాలో ప‌ర్య‌టిస్తున్నారు. రానున్న పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనేందుకు అవసరమైన సన్నాహకాల్లో ఆయన ఉన్నారు. కాగా, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ గొంతు సర్జరీ కోసం బెంగళూరుకి వెళ్లారు. అంతేగాక‌, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఆ రాష్ట్రంలో లేరు. ఇక కేజ్రీవాల్ త‌మ ప్ర‌భుత్వంపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కునేందుకు మోదీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ ట్విట్ట‌ర్ ఖాతాలో ఢిల్లీలో సీఎంతో పాటు రాష్ట్ర‌ మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని పేర్కొన్నారు. త‌మ‌కు రాసుకునేందుకు పెన్ను కొనుక్కునే అధికారం కూడా లేదని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు మోదీ రాష్ట్రంలోని అన్ని అధికారాలను వారి గుప్పిట్లోనే ఉంచుకున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. చికెన్‌ గున్యా, డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాపిస్తోన్న అంశంపై వారినే నిలదీయండి అని కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News