: భారీ నష్టంలో మార్కెట్... ఫెడ్ వడ్డీ పెంపు అంచనా వార్తలతో రూ. 2.20 లక్షల కోట్లు ఆవిరి!


అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయని, దీంతో వర్ధమాన దేశాల్లోని పెట్టుబడులన్నీ అమెరికావైపు మళ్లుతాయని విశ్లేషకులు వేస్తున్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించిన వేళ, భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభంలో 550 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, ఆపై కాస్తంత తేరుకున్నప్పటికీ, భారీ నష్టాన్ని మాత్రం అధిగమించలేకపోయింది. గత వారాంతంలో రూ. 1,12,16,034 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,09,86,139 కోట్లకు తగ్గగా, ఇన్వెస్టర్ల సంపద రూ. 2.20 లక్షల కోట్లు ఆవిరైనట్లయింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 443.71 పాయింట్లు పడిపోయి 1.54 శాతం నష్టంతో 28,353.54 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 151.10 పాయింట్లు పడిపోయి 1.70 శాతం నష్టంతో 8,715.60 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 2.95 శాతం, స్మాల్ కాప్ 2.35 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 5 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హిందాల్కో, యస్ బ్యాంక్, టాటా స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,894 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 689 కంపెనీలు లాభాలను, 2,031 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. తదుపరి సెషన్లలో సైతం బెంచ్ మార్క్ సూచికలు ఒత్తిడిలోనే కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడ్ నిర్ణయం వెలువడిన తరువాతనే స్టాక్ మార్కెట్లకు తదుపరి దిశానిర్దేశం జరుగుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, నేటి ఆసియా మార్కెట్లో నిక్కీ 1.76 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.74 శాతం, హ్యాంగ్ సెంగ్ 3.47 శాతం, కోస్పీ 2.33 శాతం, షాంగై కాంపోజిట్ 1.92 శాతం నష్టపోయాయి. కపడటి సమాచారం అందే వరకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:40) యూరప్ మార్కెట్లలో ఎఫ్టీఎస్ఈ 1.51 శాతం, సీఏసీ 1.95 శాతం, డిఏఎక్స్ 2.02 శాతం నష్టాల్లో నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News