: కూతురి పెళ్లికి ఆభరణాలు చేయించుకున్న వ్యాపారి!... కొల్లగొట్టిన దొంగలు!
అనంతపురం జిల్లా ధర్మవరంలో నిన్న రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఓ ఇంటిలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు పెళ్లి కోసం చేయించి పెట్టుకున్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళితే... పట్టణంలోని కేశవనగర్ కు చెందిన వ్యాపారి రమేశ్ తన కూతురు వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి సందర్భంగా కూతురుకు ఇచ్చేందుకు ఆయన 75 తులాల బంగారు, 2 కిలోల వెండితో ఆభరణాలు చేయించారు. నిన్న రాత్రి ఆయన ఇంటిలోకి చొరబడ్డ దొంగలు మొత్తం నగలన్నీ ఎత్తుకెళ్లారు. తెల్లారగానే విషయం తెలుసుకుని షాక్ తిన్న రమేశ్ హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు చేరుకుని బావురుమన్నాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం వేట మొదలెట్టారు.