: గ్యాంగ్ స్టర్ గతించినా అతడి దందా మాత్రం ఆగలేదు!... మహిళా న్యాయవాదిపై అనుచరుల దౌర్జన్యం!
కరుడుగట్టిన నేరగాడిన ఎదిగిన గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమైపోయాడు. పాలమూరు జిల్లా షాద్ నగర్ లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల తూటాలకు అతడు ప్రాణాలు విడిచాడు. దీంతో నయీమ్ దందాకు చెక్ పడిపోయినట్లేనని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గ్యాంగ్ స్టర్ గతించినా... అతడు నెరపిన దందాకు మాత్రం చెక్ పడలేదని నిన్న ఉదయం భాగ్యనగరిలో జరిగిన ఓ ఘటన ఖాకీలకు డేంజర్ బెల్స్ మోగించింది. మూసారాంబాగ్ లోని ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... రైల్వే శాఖలో డిప్యూటీ పర్సనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు... ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలోని సూర్యోదయ అపార్ట్ మెంట్ లో తన భార్య పేరిట 104వ నెంబరు ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు. దానిని మహిళా న్యాయవాది అగ్నిహోత్రం భారతిలక్ష్మికి అద్దెకిచ్చారు. ఈ క్రమంలో తన సొంత అవసరాల మేరకు భారతిలక్ష్మి నుంచి రూ.6 లక్షల మేర అప్పు తీసుకున్న శ్రీనివాసరావు... సదరు ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వేరే ఎవరికో విక్రయించడమెందుకు ఫ్లాట్ ను తానే కొనుక్కుంటానంటూ భారతిలక్ష్మి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు శ్రీనివాసరావు తొలుత ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఆ తర్వాత ఓ కొలిక్కివచ్చాయి. ఇరు వర్గాల మధ్య ఫ్లాట్ విక్రయానికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. ఈ క్రమంలో నిన్న ఉన్నపళంగా 50 మంది అనుచరులను వెంటేసుకుని ఫ్లాట్ కు వచ్చిన సురేందర్ రెడ్డి అనే వ్యక్తి భారతిలక్ష్మి కుటుంబంపై విరుచుకుపడ్డారు. ప్రధాన ద్వారం వద్ద నానా బీభత్సం సృష్టించిన అతడు ఇంటిలో ఉన్న రూ.2.5 లక్షల నగదు, 6 తులాల బంగారు గొలుసు, 4 తులాల బంగారు గాజులు, డైమండ్ రింగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దాడితో షాక్ తిన్న భారతిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా... సురేందర్ రెడ్డిని మలక్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. నయీమ్ అనుచరుడినంటూ చాలా కాలం క్రితమే రంగంలోకి దిగిన సురేందర్ రెడ్డి, భారతిలక్ష్మి ఇంటిపై ఇప్పటికే రెండు పర్యాయాలు దాడి చేశాడట. అతడి నుంచి ప్రాణహాని ఉందని భారతిలక్ష్మి నగర పోలీస్ కమిషనర్ కు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన క్రమంలోనే అతడు నిన్న భారతిలక్ష్మి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశాడట.