: డాన్ కే షాకిచ్చిన నమ్మినబంటు!... రూ.40 కోట్లతో అఙ్ఞాతంలోకి దావూద్ ముఖ్య అనుచరుడు!


బెదిరించి డబ్బు వసూలు చేయడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా... ప్రధాన కార్యకలాపాలుగా వేల కోట్ల నేర సామ్రాజ్యానికి డాన్ గా ఎదిగిన భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా మోసపోయాడు. ముంబై బాంబు పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ కు పారిపోయి కరాచీలో తలదాచుకుంటున్న అతడిని మోసం చేసింది వేరెవరో కాదు... అతడికి నమ్మినబంటుగా ఉన్న అతడి ముఖ్య అనుచరుడేనట! ఇక ఈ మోసం విలువ రూ.40 కోట్లట. వివరాల్లోకెళితే... ఢిల్లీలో దావూద్ కు ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్న ఖాలిఖ్ అహ్మద్... డాన్ పేరు చెప్పి ఓ వ్యాపారి నుంచి రూ.40 కోట్ల మేర నిధులు సేకరించాడు. సదరు డబ్బును డాన్ కు పంపేందుకు అతడు సదరు వ్యాపారి వద్ద రూ.5 కోట్ల మేర కమిషన్ కూడా తీసుకున్నాడట. ఆ తర్వాత హవాలా మార్గం ద్వారా ఢిల్లీ నుంచి తరలివెళ్లిన రూ.40 కోట్లు దావూద్ ను చేరలేదు. విచిత్రంగా ఈ మొత్తం నగదుతో పాటు ఖాలిఖ్ కూడా అదృశ్యమయ్యాడు. దీనిపై తన మరో అనుచరుడు డాన్ కు ఫిర్యాదు చేయగా, దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఇద్దరు అనుచరులను డాన్ రంగంలోకి దింపాడట. ఈ మేరకు ఖాలిఖ్, పాక్ లో దావూద్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్న జబీర్ మోతీకి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం మణిపూర్ లో ఉన్నాడని భావిస్తున్న ఖాలిఖ్ తానేమీ తప్పు చేయలేదని జబీర్ తో వితండ వాదన కూడా చేశాడని భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. సదరు మొత్తాన్ని ఫ్రీజ్ చేసే క్రమంలో దర్యాప్తు సంస్థలే ఈ పని చేసి ఉంటాయని అతడు వాదించాడట. ఇదిలా ఉంటే... ఈ 40 కోట్లలో సగం మొత్తాన్ని ఖాలిఖ్ పనామాలోని బ్యాంకులకు తరలించినట్లు సమాచారం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే... దావూద్ పేరిట వసూలు చేసిన సదరు మొత్తంలోని మిగిలిన సగభాగాన్ని ఖాలిఖ్.. దావూద్ కు చెందిన అంతర్జాతీయ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టాడట.

  • Loading...

More Telugu News