: కేవలం 5 లక్షల మందికి వచ్చిన ఆ ఆలోచనతోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది!: ఉండవల్లి
విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి ఎందుకు వచ్చిందన్న విషయమై ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో కారణం చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రానుందన్న విశ్లేషణలు, అంచనాలతో ఏపీలోని 13 జిల్లాల ప్రజల్లో కేవలం 5 లక్షల మందికి వచ్చిన ఆలోచనే చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసిందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, రాష్ట్రంలోనూ బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే, ప్రత్యేక హోదాతో పాటు, వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని, కేవలం ఈ స్వల్ప తేడాయే తెలుగుదేశానికి అధికారం కట్టబెట్టిందని అన్నారు. కొంచెం ఆలోచించి ఓటేసే వారికి చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా, బీజేపీ అంటే ఇష్టం లేకపోయినా, హోదా కోసమే వారు అప్పుడు తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు పలికారని వివరించారు. ఇప్పుడు వారందరి ఆశలనూ అడియాసలు చేస్తున్నారని, హోదా ఇవ్వకుంటే తదుపరి ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో జైట్లీ ప్రసంగం విన్న తనకు రక్తం మరిగిపోయిందని చెప్పిన చంద్రబాబు, నేడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.