: దుబాయ్ వ్యాపారస్తుడితో డిన్నర్ చేసి లక్షలు దోచుకెళ్లిన యువతి
దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యాపారస్తుడు ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో దిగితే, బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి, హీరోయిన్ చాన్స్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న ఓ నటి డిన్నర్ లో కలిసి, ఆపై రూ. 46 లక్షల విలువైన వాచ్ తో పాటు లక్షల రూపాయలను కాజేసి వెళ్లింది. వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తనను కలిసిన యువతితో డిన్నర్ ముగించుకున్న వ్యాపారి, మరుసటి రోజు ఉదయం కలుద్దామని ఆమెకు చెప్పి పంపాడు. ఉదయం నిద్ర లేచి చూసే సరికి తన చేతికి ఉండాల్సిన రూ. 46 లక్షల విలువైన గడియారం, గదిలో ఉన్న లక్షల నగదు కనిపించలేదు. దాంతో ఆ యువతికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. కేసును విచారిస్తున్న పోలీసులు, వ్యాపారికి ఢిల్లీలో సొంత ఇల్లు ఉందని గుర్తించడం గమనార్హం. సొంతిల్లున్నా ఆయన హోటల్ ను ఎందుకు ఆశ్రయించాడు? అసలు హోటల్ గదిలో ఏం జరిగింది? అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు విచారణ ప్రారంభించారు.