: నేడు టీఎస్ ఎంసెట్ 3, కోడ్ ఎస్-2 పేపర్... 'లీక్' కేసు విద్యార్థులకూ పరీక్షలు రాసేందుకు అనుమతి
తెలంగాణలో ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దయిన ఎంసెట్-2 స్థానంలో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఎంసెట్-3 నేడు జరుగనుంది. ఈ ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగనుండగా, అందుకు గంట ముందుగానే విద్యార్థులను లోపలికి అనుమతిస్తామని, 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా హాలులోకి వెళ్లేందుకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షకు కోడ్ ఎస్-2 ప్రశ్నాపత్రాన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఎంసెట్ -2 లీక్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న విద్యార్థులు సైతం పరీక్షలను రాసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పది గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటి నుంచే సందడి మొదలైంది.