: ప్రత్యేకహోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు విభజన సమయంలో ఎందుకు అడిగారు?: చంద్రబాబు, వెంకయ్యనాయుడులను నిలదీసిన పవన్ కల్యాణ్


ప్రత్యేకహోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు విభజన సమయంలో ఎందుకు ప్రత్యేకహోదాను అడిగారని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును నిలదీశారు. ఓ టీవీ ఛానెల్ తో ఈ సాయంకాలం ఆయన మాట్లాడుతూ, రాజకీయనాయకులు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, ఇలా మాటలు మార్చేస్తుంటే ఏం చేయగలమని అన్నారు. ఒక్కోసారి ఒక్కో మాట చెబుతుంటే ప్రజలు ఎలా నమ్మాలని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదా ఇవ్వమని, హోదా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా తెచ్చేస్తానని వెంకయ్యనాయుడుగారు ఎందుకు ఆ రోజు చెప్పారు? ప్రత్యేకహోదా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చంద్రబాబునాయుడు ఎందుకు అన్నారు? 'తల్లిని చంపి, బిడ్డను బతికించారు. ప్రత్యేకహోదా కల్పించి ఏపీని ఆదుకుంటా'మని మోదీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పారు? అని ఆయన నిలదీశారు. 'ఈ రోజు ఇన్ని మాటలు చెబుతున్న మీరు, ఆ రోజు కూడా అవే మాటలు చెప్పి ఎన్నికలలోకి ఎందుకు వెళ్లలేదో చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఓట్లడిగినప్పుడు ఒకలా మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాటలు మార్చేస్తే ఎలా? అని ఆయన అడిగారు. 'ఎంతో మంది ఐఏఎస్ లు నాతో చెబుతూ, పార్లమెంటులోను, కేంద్ర మంత్రుల దగ్గర మన ఏపీ ఎంపీలు ఏమీ మాట్లాడరని చెప్పారు. కాంట్రాక్టులు, సొంత పనుల గురించి మాత్రమే ఎంతో మాట్లాడుతారని, అలాంటి వారు రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి నోరు మూసుకుని ఉంటారని వారు నాకు చెప్పారు. ఇవన్నీ నేను చెబితే నిరూపించమంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ అలా నిరూపిస్తే ఏం చేస్తారు? మహా అయితే రాజీనామా చేస్తారు. అంతకు మించి ఏం చేస్తారు?' అని ఆయన అడిగారు.

  • Loading...

More Telugu News