: ఉపరాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్యనాయుడు ఇదంతా చేస్తున్నారు: జైరాం రమేష్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వని పాపం 14వ ఆర్థిక సంఘానిది కాదని, అది ఎన్డీఏదేనని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రం ప్రజలని మభ్యపెడుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రానికి అప్పగించడం సరికాదని, ఒకవేళ అప్పజెప్పితే చట్టసవరణ కూడా చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హోదా విషయంపై కేంద్ర మంత్రులు ఆర్థిక సంఘం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. జైట్లీ ఏపీకి కొత్తగా ఏమీ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు వెంకయ్యనాయుడు సీనియర్ మంత్రి తరహాలో మాట్లాడడం లేదని జైరాం రమేష్ అన్నారు. హోదా ఇవ్వకపోతే ఏపీకి ఎంతో నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ఏపీకి హోదా ఇవ్వకపోవడం వల్ల ఏటా 60 వేల కోట్ల రూపాయలు నష్టమని అన్నారు. మరో మూడేళ్లలో ఎన్నో కోట్ల నష్టం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై విమర్శలు మానుకొని ఏపీకి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కారణాలేంటో తెలియదు కానీ వెంకయ్య అసహనంతో ఉన్నారని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్య ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇతరులను నిందించడం మానేసి హోదా కోసం చట్ట సవరణ చేయాలని ఆయన సూచించారు. చట్టంలోని అంశాలను కేంద్రం పక్కదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ గందరగోళం నెలకొల్పుతోందని వ్యాఖ్యానించారు.