: రాహుల్ రెండో సభ నుంచి మంచాలు మాయం కాలేదు... ప్రశాంత్ కిశోర్ పకడ్బందీ ఏర్పాట్లు!
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఎనిమిది నెలల ముందే ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ 'ఖాట్ పే చర్చా' (మంచాలపై చర్చ) పేరిట రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సభను నిర్వహించిన వేళ, అక్కడికి వచ్చిన వారంతా కూర్చునేందుకు ఏర్పాటు చేసిన 2 వేల మంచాలను ఎత్తుకెళ్లగా, రాహుల్ ప్రసంగం కన్నా, మంచాలను ఎత్తుకెళ్లిన కార్యకర్తలు, రైతుల గురించిన వార్తకే మీడియాలో ప్రాధాన్యం దక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సైతం ఒకింత అసహనానికి గురి కాగా, ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్వయంగా రంగంలోకి దిగారు. యూపీలోని ఖలీలాబాద్ లో ఇదే తరహా మంచాల సభ జరుగగా, ఒక్కరు కూడా మంచాలను తీసుకెళ్లలేదు. మంచాలు తీసుకు వెళ్లాలన్న ఆలోచనతో వచ్చిన వారు కూడా వాటిని తాకలేదు. సభకు వచ్చిన వారు మంచాల జోలికి పోకుండా ప్రశాంత్ కిశోర్ పెద్ద మంత్రాంగాన్నే నడిపినట్టు తెలుస్తోంది. రెండో సభకు ఐపీఏసీ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యకర్తలను రంగంలోకి దించిన ఆయన, ఎవరూ మంచాలను తరలించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగారు. మొత్తం 20 మందికి పైగా నల్ల టీ షర్టులు ధరించిన యువతీ యువకులు, సభలోనే ఉండి తమ స్మార్ట్ ఫోన్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రశాంత్ కు పంపుతూ, ఆయన సలహా, సూచనల మేరకు, సభ ముగియగానే ప్రజలు ప్రశాంతంగా వెళ్లిపోయేలా చూశారు. ఇక రాహుల్ పర్యటనను పూర్తి విజయవంతం చేసేందుకు తనదైన వ్యూహాన్ని రచిస్తున్న ప్రశాంత్, దాదాపు 50 మంది ఐపీఏసీ కార్యకర్తలను ఆయన ర్యాలీలో ఉంచారు. వీరంతా రాహుల్ ప్రచారానికి మంచి మీడియా కవరేజ్ వచ్చేలా చూడటం నుంచి, ర్యాలీ సాగే తీరు, ప్రజా స్పందన వంటి వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నారు. రాహుల్ పర్యటనకు సంబంధించిన దృశ్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. రాహుల్ కంటిలో పడేందుకు ఓ స్కూటీపై వస్తూ ప్రయత్నిస్తున్న తల్లీ బిడ్డల ఫోటోను ఐపీఏసీ కార్యకర్త పాయల్ తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది బాగానే హల్ చల్ చేసింది.