: కేసీఆర్ కొత్త ఆలోచన... ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు!


సొంత వాహనం లేని వారు సమీపంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లకు చేరుకోవడానికి ఎన్నెన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆటోలు ఎక్కితే, ప్రయాణించాల్సిన దూరానికి ఆర్టీసీ బస్సుకు ఎంత చెల్లించాలో అంతకన్నా ఎక్కువే పెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అదే టీఎస్ ఆర్టీసీ డోర్ టూ డోర్ సర్వీస్. ఇందులో భాగంగా బస్సులు ఇంటి ముందు నుంచే తిరుగుతుంటాయి. ఇంటి ముందు లేదా ఆ వీధిలోకి బస్సులు వచ్చే పరిస్థితి లేకుంటే అతి దగ్గర్లోని పికప్ పాయింట్ వద్ద ఈ బస్సులను ఎక్కవచ్చు. ఇందుకోసం నూతనంగా మినీ బస్సులను తెలంగాణ సర్కారు కొనుగోలు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో ఏసీ బస్సులు, పల్లె ప్రాంతాల్లో నాన్ ఏసీ బస్సులు తిరుగుతాయి. కొత్తగా 236 మినీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన టీఎస్ ఆర్టీసీ, వీటిల్లో 100 ఏసీ బస్సులుంటాయని ప్రకటించింది. దసరా నుంచి మొదలయ్యే ఈ సేవల తొలి దశలో భాగంగా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో 20 మినీ ఏసీ బస్సులు తిరుగుతాయి. ఇవి ప్రయాణికుల ఇళ్ల ముందుకు వెళతాయి. ఇక ఈ బస్సులను తమ ఇంటి ముందుకు తెప్పించుకోవాలని భావించేవారి కోసం ఓ మొబైల్ యాప్ ను సిద్ధం చేశారు. ఈ యాప్ ద్వారా చిరునామా చెబితే, సమయానికి బస్సు వచ్చేస్తుంది. తొలిదశలో ప్రజల నుంచి లభించే ఆదరణను చూసిన అనంతరం మిగతా అన్ని ప్రాంతాలకూ ఇవే సేవలను విస్తరిస్తామని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు వెల్లడించారు. గ్రామీణ రూట్లలో అంతగా ఆదాయాన్ని ఇవ్వని పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్న ప్రాంతాలకు మలిదశలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News