: చట్టంలో ఉన్న అంశాలను కూడా ఇచ్చే ఉద్దేశంలో లేని మోదీ ప్రభుత్వం: కేవీపీ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలన్న అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదని ఆరోపించడం బీజేపీ నేతల బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని కాంగ్రెస్ పార్టీనేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని ఎలా మీరుతారని ప్రశ్నించిన ఆయన, పరిస్థితులు చూస్తుంటే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నిలబెట్టుకునేట్టు లేదని దుయ్యబట్టారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ను కేటాయించాలని చట్టంలో చేర్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇంతవరకూ ఎందుకు జోన్ ప్రకటించలేదని అడిగారు. చట్టంలో ఉన్నవాటిని వెంటనే అమలు చేయడానికి మీనమేషాలు లెక్కించడం ఎందుకని విమర్శించారు. తక్షణం విభజన హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.