: విశ్వసనీయత తగ్గుతోంది... రాజకీయాలు వదిలెయ్: కేజ్రీవాల్ కు అన్నా హజారే సలహా
లోక్ పాల్ బిల్లుతో ఒకటైన సామాజిక ఉద్యమవేత్త అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ ల మధ్య దూరం మరింతగా పెరిగింది. ఒకప్పుడు తనకు ఎంతో నమ్మకస్తుడైన కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఇప్పుడు ఉద్యమించాలని అన్నా హజారే భావిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన స్వయంగా ఎంచుకున్న మంత్రులు తప్పు మీద తప్పు చేస్తున్న వేళ, లోక్ పాల్ తరహా నిరసనలకు మరోసారి దిగాలని ఆయన ఆలోచిస్తున్నారు. తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడిన హజారే, "కేజ్రీవాల్ నిజాయతీపై నాకు నమ్మకం ఉంది. కానీ ఆయన పార్టీలోకి తీసుకున్న వారి చర్యలతో విశ్వసనీయత తగ్గుతోంది. ప్రజల మన్ననలు పొందాలంటే, రాజకీయం ద్వారా సంక్రమించిన అధికార పీఠాన్ని వదిలి జాతి సేవలో అంకితం కావాలి. వచ్చే సంవత్సరం పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. కానీ ఓటర్లు ఇటీవలి ఘటనలన్నింటినీ గుర్తు పెట్టుకునే తీర్పిస్తారు" అని అన్నారు. మంచి నడవడిక ఉన్న అభ్యర్థులను మాత్రమే ఆయన తన పార్టీలోకి తీసుకోవాలి. ఇతర రాజకీయ పార్టీలకు, ఆప్ కు ఇప్పుడు తేడా లేకుండా పోయిందని ఆయన అన్నారు.