: సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అలాంటి భావనే ఉండేది: హీరోయిన్ అనుష్క
పదేళ్లకు పైగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నాయికిగా కొనసాగిన అనుష్క తన మనసులోని భావాలను బయటపెట్టింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎప్పుడెప్పుడు ఇంటికి పారిపోదామా అని అనిపించేందని పేర్కొంది. హీరోయిన్‌గా తాను పొందినవన్నీ లేకపోయినా హ్యాపీగానే ఉండేదాన్నంటూ కాస్త వైరాగ్యంగా మాట్లాడింది. చిన్నప్పుడు తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు తనకు నచ్చేవి కావని, సినీరంగంలోకి వచ్చాక కూడా ఇదే భావన ఉండేదని చెప్పుకొచ్చింది. అప్పట్లో తనకు చాలా తక్కువమంది స్నేహితులు ఉండేవారని, కానీ సినిమాల్లోకి వచ్చాక తన ప్రపంచం పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. ఎప్పుడూ షూటింగ్‌లు, ఆటోగ్రాఫ్‌లతోనే గడిచిపోతోందని తెలిపింది. అయితే ఇవన్నీ లేకపోయినా తాను హ్యాపీగానే ఉండగలనని పేర్కొంది. సినీరంగం ద్వారా సంపాదించిన కీర్తి తన నెత్తికెక్కలేదని వివరించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగానని, అభినందనలు, కీర్తిని అందుకున్నానని గర్వంగా చెప్పింది. అయితే ఇంటిలో అడుగుపెట్టాక అవన్నీ మర్చిపోతానని పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటిగా ఉన్న తనకు అందుకు తగ్గా పాత్రలే వస్తున్నాయని సంతోషంగా చెప్పిందీ యోగా సుందరి.